DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో పెద్ద స్మార్ట్ దోపిడీ?: జనసేన 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, జనవరి 24, 2022 (డిఎన్ఎస్):* ఆనందపురం మండలం లో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణలో స్మార్ట్ దోపిడీకి అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పథక రచనలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు.

ప్రభుత్వ పెద్దల బినామీలమంటూ అసైన్డ్, డీ పట్టా రైతులకు భయపెట్టి, మభ్యపెట్టి  మోసపూరితమైన లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఆనందపురం మండలం లో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ

సోమవారం  రెవిన్యూ డివిజన్ అధికారి, విఎంఆర్డీఏ వైస్ చైర్మన్ లకు ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జగనన్న టౌన్ షిప్ లకు  భూ సమీకరణలో జనసేన  అభిప్రాయాలు, అభ్యంతరాలను ఆనందపురం తహసీల్దార్ కు తెలిపారు.  ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరిట మధ్యతరగతి వర్గాల గృహాలకు

స్థలాలు మంజూరు చేసేందుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారం, రామవరం, పాలవలస రెవిన్యూ గ్రామాలలో 363 ఎకరాల భూములను భూ సమీకరణ పథకం కింద తీసుకునేందుకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఇందులో మూడు వందల ఎకరాలు ఎసైన్డ్ ,డీ పట్టా భూములు  కాగా మిగిలినవి జిరాయితీ అని,  విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా

ఈ భూముల్లో లేఅవుట్లు చేసి విక్రయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గతంలో విశాఖ  పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా భూ సమీకరణ ప్రక్రియలో చేపట్టిన మధురవాడ  కొమ్మాది ఓజోన్ వాలీ, పెందుర్తి మండలంలోని  ముదపాక భూముల వ్యవహారాలు వందల కోట్ల అక్రమాలకు చిరునామాగా మారాయని గుర్తు చేశారు.  ఆరోపణల నేపథ్యంలో ఓజోన్

 వ్యాలీ అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిటీని  వేయగా, ముదపాక భూ సమీకరణను రద్దు చేసిందన్నారు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి  ఆనందపురం మండలం లో మూడు వందల అరవై ఎకరాల సమీకరించడం కూడా మరో  కుంభకోణానికి అవకాశం కల్పించడమేనన్నారు. అధికార పార్టీ నేతలు కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ముందుగానే భూసమీకరణ సమాచారాన్ని

తెలుసుకొని అసైన్డ్, డీ పట్టా రైతులకు మభ్యపెట్టి  మోసపూరితమైన లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నిజమైన రైతులకు వారికి దక్కకుండా చట్టవ్యతిరేకమైన అగ్రిమెంట్లు చేసుకున్నారన్నారు. దీనివల్ల తరతరాలుగా ఆ భూములను నమ్ముకొని సాగు చేస్తూ బ్రతుకుతున్న బడుగు బలహీన వర్గాల రైతులు

తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ గ్రామాల్లో భూ సమీకరణ పేరిట జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో  వార్తలు వచ్చిన సంబంధిత అధికారులు స్పందించినదాఖలాలు  కనిపించలేదన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలు , అక్రమాలకు నెలవైన విశాఖలో ఇది మరో కుంభకోణం గా మారనుందన్నారు. విశాఖ అక్రమాలపై ఇప్పటికేరెండు

 ప్రత్యేక దర్యాప్తు బృందం లతో( సిట్ ) విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు వాటిని పక్కనపెట్టి భూ సమీకరణ పేరిట మరో  కుంభకోణాన్ని  ప్రోత్సహించడం అధికారాన్ని దుర్వినియోగం చేయటమేనన్నారు. విశాఖ పట్టణ అభివృద్ధి సంస్థ పెద్ద సంఖ్యలో లే అవుట్ లు  వేసి  స్ధలాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే,

ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖ మెట్రో రీజియన్ పరిధిలో ప్రభుత్వం భూ సమీకరణ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ  పట్టణాభివృద్ధి  సంస్థ చేతుల్లో ఉన్న వేల ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లు నిర్మించుకోకుండా ఆ భూముల వదిలేసి కొత్త గా

సమీకరించడం అన్యాయమన్నారు.  ఆనందపురం మండలం లోని మూడు గ్రామాల్లో చేపట్టిన భూ సమీకరణ ను రద్దు చేసి పేద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూ సమీకరణ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి గత సంవత్సర కాలంలో చేతులు మారినా , ఒప్పందాలు జరిగిన భూ లావాదేవీలను గుర్తించి అందుకు బాధ్యులైన రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై

చర్యలు తీసుకోవాలన్నారు. అనివార్యమై భవిష్యత్తులో ఎప్పుడైనా భూ సమీకరణ చేయాల్సి వస్తే కచ్చితంగా భూములు కోల్పోయే రైతులకే ప్రతిఫలం అందే విధంగా ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని కోరారు. ఎస్సైన్డ్   భూములు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam