DNS Media | Latest News, Breaking News And Update In Telugu

70 ఏళ్లలో తూగో జిల్లా నుంచే 16 మంది మహిళలు అసెంబ్లీకి 

*చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం*

DNS Report : P. Raja, Bureau Chief, Amaravati    

అమరావతి, మార్చి 09, 2023 (DNS Online ):  ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు.  కాని రాజకీయ రంగంలో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ ఒక్క రంగంలో మగ మహారాజులదే పై

చేయిగా నిలుస్తుంది. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల కాలంగా ఆమోదం పొందలేక పోతుంది. కాని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం  వల్ల వారి సంఖ్య పెరిగింది. 1995లో మహిళకు మూడో వంతు రిజర్వేషన్లు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో కల్పించారు. ఆ తర్వాత 2013 గ్రామ

పంచాయతీ ఎన్నికల నుంచి 50 శాతానికి రిజర్వేషన్లకు పెంచారు. ఈ రిజర్వేషన్ల  వల్ల వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, మున్సిపల్  కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీ చైర్మన్లు మహిళలు  సగం  మంది ఉన్నారు. కాని అసెంబ్లీ, పార్లమెంటుకు వెళ్లే వారి సంఖ్య చాలా స్వల్పంగానే

ఉంటుంది.

*70 సంవత్సరాలలో 16 మంది మాత్రమే...*

రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 70 ఏళ్ల కాలంలో కేవలం 16 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీకి వెళ్లాలంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. రాష్ట్రంలో అత్యధిక  నియోజవర్గాలున్న ఈ జిల్లాలోనే ఇంత తక్కువ సంఖ్యలో అసెంబ్లీకి వెళ్తే ఇక మిగిలిన

జిల్లాల పరిస్థితి ఏంటో వేరే చెప్పనవసరం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాక ఇప్పుడు వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 16 మంది  మాత్రమే గెలవడానికి కారణం వారిలో సత్తా లేక కాదు. రాజకీయ పార్టీలు తగినన్ని సీట్లు ఇవ్వక. 

*నాలుగు ఎన్నికలలో ఒక్కరూ లేరు*

తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1952, 1955,

1962,1967 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే పదవి దక్కక పోవడం విచారకరం. అయితే 1955లో బూరుగుపూడి నియోజకవర్గం నుంచి  గెలుపొందిన నీరుకొండ వెంకట రామారావు మరణించడంతో ఆయన భార్య వెంకటరత్నను సానుభూతితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆవిడే ఈ జిల్లాకు తొలి మహిళా ఎమ్మెల్యే. నాలుగు ఎన్నికలలో ఒక్క మహిళ ఎమ్మెల్యే కూడా

గెలవకపోయినా 1972 అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. వారిలో కొత్తపేట నుంచి దెందులూరి భాను తిలకం, పామర్రు నుంచి గాదం కమాదేవి, ఎల్లవరం నుంచి పి.రత్నాబాయి, తుని నుంచి విఎన్ విజయలక్ష్మి దేవి లు ఉన్నారు. మీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.

1978లో తుని నుంచి విజయలక్ష్మి మరో సారి విజయం సాధించారు. అంతేకాదు 1981లో అంజయ్య క్యాబినెట్‌లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు మహిళ మంత్రి ఈ జిల్లాలో లేరు. 1978లో ఎన్నికల్లోనే రాజమండ్రి నుంచి తటపత్తి సత్యవతి గెలుపొందారు.
 
 *టిడిపి ఆవిర్భావం తర్వాత....*
 
 తెలుగుదేశం పార్టీ

ఆవిర్భావం తర్వాత జరిగిన 1983 ఎన్నికల్లో మహిళ ఎమ్మెల్యే సంఖ్య ఒకటికి పరిమితమైంది. ఆ ఎన్నికల్లో టిడిపి నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యేగా వి. సక్కుబాయి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో మహిళలకు చోటు లేదు. 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఒక్క మహిళ కూడా గెలవలేదు. అంటే అది మహిళలు తప్పు కాదు కాంగ్రెస్,

టిడిపి పార్టీలు టిక్కెట్లు కేటాయించపోవడమే. 1999 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలు మహిళల ఆగ్రహం గురికాకుండా టికెట్లు కేటాయించారు. టిడిపి నుంచి బూరుగుపూడి ఎమ్మెల్యేగా కోర్పు అచ్చమాంబ, ప్రతిపాడు నుండి పర్వత బాపనమ్మ, అల్లవరం నుంచి పిల్లా జగదీశ్వరి, సంపర నుంచి పిల్లి అనంతలక్ష్మిలు విజయం సాధించారు. 
    2004

కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో నగరం నుంచి పోటీ చేసిన పాముల రాజేశ్వరి దేవి, ఒక్కరే ఈ జిల్లా నుంచి గెలుపొందారు.ఆ ఎన్నికలలో టిడిపి ఏకంగా ఐదుగురు మహిళలకు సీట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభంజనంలో గెలవలేకపోయారు.  2009 ఎన్నికల్లో నగరం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాములు రాజేశ్వరి దేవి మరోసారి విజయ సాధించారు. అలాగే

ప్రజారాజ్యం పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత గెలుపొందారు. 2014 ఎన్నికల విషయానికొస్తే టిడిపి నుంచి పిల్లి అనంతలక్ష్మి(కాకినాడ రూరల్) వైఎస్ఆర్ పార్టీ నుంచి  వంతల రాజేశ్వరి(రంపచోడవరం) లు గెలుపొందారు.
    2019 ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు మహిళలు గెలవడం విశేషం. కాకినాడ ఎంపీ

స్థానానికి తొలి మహిళ ఎంపీగా వంగా గీత గెలుపొందారు. అలాగే అమలాపురం పార్లమెంట్ నుంచి చింతా అనురాధ విజయం సాధించారు. రంపచోడవరం అసెంబ్లీ స్థానానికి నుంచి నాగులపల్లి ధనలక్ష్మి గెలుపొందారు. వీరంతా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలవగా రాజమహేంద్రవరం సిటీ నుంచి టిడిపి పార్టీకి చెందిన ఆదిరెడ్డి భవాని విజయం

సాధించారు.

జిల్లాలో విశేషాలు చెప్పాలంటే తుని నుంచి విజయలక్ష్మి, నగరం నుంచి పాముల రాజేశ్వరి దేవి, సంపర, కాకినాడ రూరల్ నుంచి పిల్లి అనంత లక్ష్మిలు రెండేసి సార్లు గెలుపొందారు.విజయలక్ష్మి ఒక్కరే మంత్రి పదవి చేపట్టారు. ఇటీవలి మృతిచెందిన సినీ నటి జమన రాజమహేంద్రవరం ఎంపీగా గెలిచారు.

 *రికార్డులు

సృష్టించిన వంగా గీత*
    
 జిల్లా రాజకీయంగా రాణించిన ఏకైక మహిళగా వంగా గీతను పేర్కొనవచ్చు. ఆమె రికార్డును బ్రేక్ చెయ్యడం ఎవరకీ సాధ్యం కాదు. ఎందుకంటే 1994లో జడ్పిటిసి వ్యవస్థ ప్రారంభమైనప్పుడు కొత్తపేట జడ్పిటిసిగా టిడిపి నుంచి  గీత గెలుపొంది జడ్పీ చైర్మన్ పదవిని అందుకున్నారు.105 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జిల్లా

పరిషత్తుకు ఏకైక మహిళా చైర్మన్ ఈవిడే.1917లో జిల్లా బోర్డుగా ఏర్పడి 1953లో జిల్లా పరిషత్ గా రూపాంతరం చెందింది. ఇన్నేళ్లలో చైర్మన్ పదవి గీత తప్ప మరో మహిళకు అవకాశం దక్కలేదు.విచిత్రం ఏంటంటే రిజర్వేషన్ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత ఒక్క సారి మాత్రమే చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ అయ్యింది. చైర్మన్ గా రాణించడంతో రాజ్యసభ కు

వెళ్ళే అవకాశం దక్కింది. ఆ తర్వాత పిఠాపురం ఎమ్మెల్సీగాను,ప్రస్తుతం కాకినాడ ఎంపిగాను గీత ఉన్నారు.ఆమె రికార్డులు బ్రేక్ చేయడం జిల్లాలు విడిపోయినందున మరొకరికి అవకాశం ఉండదు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam